Wednesday, December 21, 2011

"బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే?

కలియుగాంతం ఆసన్నమయింది, బ్రహ్మ తర్వాత యుగానికి శ్రీకారం చుట్టడానికి ఈ సారి వెరైటీగా కంప్యూటర్ లో సృష్టి మొదలు పెడదాం అనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ప్రాక్టీస్ కోసం ఏదైనా సాప్ట్ వేర్ కంపనీ లో చేరదాం అని నిర్ణయించుకొన్నాడు. తనతో పాటు ఇంకొంత మంది దేవుళ్ళని కూడా ప్రాక్టీస్ కి అహ్వానించాడు.

బ్రహ్మ సాప్ట్ వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. సాప్ట్ వేర్ ని సృష్టించటం బ్రహ్మ పని. బ్రహ్మండంగా కోడింగ్ మొదలుపెట్టాడు. కాని అప్పుడప్పుడు అలవాటులో పొరపాటు గా బగ్గులు కూడా వచ్చేవి.
బ్రహ్మ సృష్టించిన బగ్గుల వల్ల ప్రాజెక్ట్ కేమి సమస్యలు రాకుండ కాపాడడం, స్థితి కారకుడైన విష్ణువు పని కాబట్టి విష్ణు మూర్తి బ్రహ్మ కి టీం లీడర్ గా జాయిన్ అయిపోయాడు.

లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న "C" లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం "C++" లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి "java" లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు.

ఈ రకం గా ప్రాజెక్ట్ లన్నీ స్క్రాప్ అవడం తో విసుగు చెందిన విష్ణు మూర్తి, బాగా ఆలోచించి ఇంకా కొంతమందిని టీం లో పెట్టుకుని ఒక్కక్కరి చేత ఒక్కో టెక్నాలజీ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయించి ఈ సారి అయినా ప్రాజెక్ట్ "OK" చేయించుకోవలని అనుకున్నాడు. వెంటనే కృష్ణావతారం లో తన అనుంగు మితృడైన అర్జునుడిని, అర్జునుడి కన్నా ప్రతిభా పాటవాలు కల ఏకలవ్యుడిని టీం లో జాయిన్ చేసుకున్నాడు.

ఏకలవ్యుడు ఏ పని ఇచ్చినా తన శక్తి సామర్ధ్యాలతో వెంటనే పూర్తి చేసేసేవాడు. ఒక వేళ తనకి ఆ టెక్నాలజీ రాకున్నా, ఆ టెక్నాలజీని గురు ముఖంగా నేర్చుకోకపొయినా మనసులో గురువు గారిని ధ్యానించుకొని, గూగుల్ లో సెర్చ్ కొట్టి ప్రాక్టీస్ చేసి నేర్చేసుకొనేవాడు(కాపీ పేస్ట్ చేసేవాడు). కాని పాపం అర్జునుడు అలా కాదు. గురు ముఖంగా విననిదే ఏ టెక్నాలజీ నేర్చుకొలేకపోయెవాడు.

ఒక సారి అర్జునుడు చేసిన కోడ్ లో కుప్పలు తెప్పలు గా బగ్గులు వచ్చాయి. సాయంత్రానికి అన్ని బగ్గులు ఫిక్స్ చేయాలని విష్ణు మూర్తి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళాడు. అర్జునుడు మహా భారత యుధ్ధం లో కౌరవ సేన లా ఉన్న బగ్గులని చూసాడు. భయపడ్డాడు, విలపించాడు. అస్త్ర సన్యాసం (రాజీనామా) చేస్తున్నాని ప్రకటించాడు.

అర్జునుడి మాటలు విన్న విష్ణు మూర్తి వెంటనే కృష్ణావతారం లోకి మారిపోయి
"అర్జునా !
బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!
బగ్గు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!
మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.
నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?"
అని సాప్ట్ వేర్ జీవిత (లైఫ్ సైకిల్) పరమార్ధాన్ని వివరించ గానే దుఃఖాన్ని విడచి కార్యొన్ముఖుడై బగ్గులన్ని ఫిక్స్ చేసాడు.

అప్పటి నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగులందరు తమ తమ స్థానాలలో త్రిమూర్తులు, అర్జునుడు, ఏకలవ్యుడు ఏర్పరిచిన సాంప్రదాయాలని పాటిస్తూ బగ్గులని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుస్తునే ఉన్నారు.

గమనిక : ఈ కథ పది సార్లు పారాయణ చేసిన వారికి పది బగ్గులు తక్కువ వస్తాయి !!!

Friday, November 6, 2009

నిరీక్షణ


ఇన్ని రోజుల ఎదురు చూపులు ముగిసాయి అన్నట్టు ఒక చిన్న ఆశాకిరణం కంటి ముందు ఉంది అని మనసు చెప్తుంది అంతలో అది నిజమేనా అని మరో ఆలోచన...ఆ కిరణం వినీలాకశంలోని తార లాగ అందనంత దూరంలో నిలిచేనా లేక నా ఆలోచనలకు నా మనసుకు అద్దం పట్టే ప్రతిబింబమై (జీవిత భాగాస్వామియై) నాపక్కన నిలిచేనా? "నా పక్కన నిలేచేనా???" అని అనిపిస్తునప్పటికి,

"నీ తోడుగా నే ఉంటా" అని చెప్పినట్టు మరో ఆలోచన..అలాంటి ఆలోచన రావటమే తడవుగా అందులోని మధురానుభూతిని మనసు ఆస్వాదించటం ప్రారంభించింది ...

ఇలాంటి కొంటె ఉహలతో మనసు ఆనందిస్తుండగా కళ్ళలో చిన్న మెరుపు ,పెదవులపై చిరుమందహాసం విరిసి, మనసులోని భావాలను ఇలా పలికిస్తాయి.."ఊహల పల్లకీలో ఉరేగించనా! ఆశల వెల్లువై రాగం పలికించనా!!!"

ఈ నిరీక్షణ అంతమైన ప్రతి సారి, ఒక కొత్త జంటను అందమైన జీవితానికి ఆహ్వానిస్తూ శ్రీకారం చుడుతుంది ..

Thursday, May 7, 2009

అందామా ..?? ఆలోచన ..???

ప్రకృతి లోని ఏ అందాన్నిచూసినా వాటికి ముగ్ధులై మనసుకు చాల ప్రశాంతత, ఆనందం కలుగుతాయి అని పలువురు అనగా విన్నాను.కొంతమేరకు నా అభిప్రాయం కూడా అదే. అలాంటి ఆనందం కేవలం అందం వలెనే మనసుకు కలుగుతుంది అనే నేటి కుర్రకారి అభిప్రాయాన్ని వింటే చాల ఆశ్చర్యం కలుగుతుంది.

ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వారు , ఆ ప్రశాంతత కళ్ళు చూసే అందం వల్లా లేక మనసు చేసే అందమైన ఆలోచనల వల్లా అని నిర్ణయించుకోవలసిన బాధ్యత ఉంది???

అందమైన ఆలోచనలు లేనప్పుడు ఆ అందానికి అర్ధమేముంది అన్న ఆత్మా విమర్శకి సమాధానం ఏమిటో???

Thursday, March 26, 2009

అందమైన భావన


ఒక వెన్నెల కురిసే ప్రశాంతమైన సాయం సమయం............సన్నగా వీచే పిల్ల గాలులు, చెక్కిళ్ళను తాకన వద్దా అన్నట్టు మెల్లగా వీస్తున్నాయి...శ్రవనానంద కరంగా కోకిల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి.. అల ప్రకృతి తనను తానూ మైమరచి ఆనందిస్తున్న వేళలో...నెలవంక తొంగి చూడటానికి ప్రయత్నిస్తుండగా .....

ఆ వెన్నెలలో ఇసుక తిన్నెలపై, కొలనులోని అలలు మృదువుగా తన పాదాలను చుంబిస్తుండగా, తమ ప్రతిబింబాన్ని కొలను నీటిలో చూచి ఆనందిస్తున్న ప్రియురాలి మనసులోని భావాలను తెలుసుకోవాలని ప్రయత్నించే రహస్య స్నేహితుడు.


ఓ అందమైన చిత్రకళా రూపాన్నీ చూసినపుడు కలిగిన స్పందనే ఈ భావన.......

Wednesday, March 25, 2009

ఊహల పల్లకి

నా ఉహలలో నువ్వే
కనుపాపలలో నువ్వే
తలపు లో నువ్వే
మనసు తెరల్లో నువ్వే

కంటి లో వెలుగై చిరు మందహాసమై కనిపించేది ఎప్పుడో...!!!


ఇది దూరమైన ప్రియుని తలచుకునే ప్రియురాలు ఆలోచన...